
జమ్మికుంట పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) లో మంగళవారం నుండి ప్రారంభమైన ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని డి ఎం హెచ్ ఓ డాక్టర్ వెంకటరమణ, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు మరియు పి ఓ ఎం సి హెచ్ డాక్టర్ సన జవేరియా కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ, ఆరోగ్య మహిళ శిబిరం ప్రతి మంగళవారం మరియు శుక్రవారములు నిర్వహించబడుతుందని తెలిపారు. శిబిరంలో 56 రకాల వైద్య పరీక్షలు జరుగుతాయని, ప్రతి మహిళ కనీసం మూడు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. మహిళలు తమ ఆరోగ్యం గురించి ఆలోచించి, అనారోగ్యం పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లడం కంటే ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని చెప్పారు.
ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడంతో పాటు, డ్రై డే గురించి సైతం వివరణ ఇచ్చారు.
జమ్మికుంట ఆరోగ్య ఉపకేంద్రం1 ఆకస్మిక తనిఖీ

ఆరోగ్య ఉపకేంద్రం1 ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డి ఎం హెచ్ ఓ డాక్టర్ వెంకటరమణ, హాజరు పట్టిక, రికార్డులు మరియు పేషెంట్లకు పంపిణీ చేస్తున్న మందులను పరిశీలించారు. ఎన్ సి డి క్లినిక్ లో అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి అనారోగ్యాలపట్ల ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు, సివిల్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, పి ఓ ఎం సి హెచ్ డాక్టర్ సన జవేరియా, జమ్మికుంట ఆరోగ్య ఉప కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చందన, మోహన్ రెడ్డి హెల్త్ ఎడ్యుకేటర్, సూపర్వైజర్స్ రత్నకుమారి, అరుణ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
