ఇక్కడ నిబంధనలు అమలు కావు..! కొండపాకలో ఇష్టారాజ్యం
వీణవంక,జూన్ 9 (జిందగీ 9 న్యూస్ ప్రతినిధి : దాట్ల శ్రీనివాస్) :
వీణవంక మండలం కొండపాక ప్రాంతంలో సహజ వనరుల విధ్వంసం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ నిబంధనలు అమలు కావడమే కాకుండా, అధికారుల నిర్లక్ష్యంతో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. మానేరు నది తీరం దగ్గర సాగుతున్న ఈ అక్రమ కార్యకలాపాలు పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయి.

ఇసుక రీచ్ లో అక్రమతలకు అడ్డు లేకుండా..
కరీంనగర్ జిల్లా ఇసుక రీచ్‌లపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ (DLSC) నిర్దేశించిన నిబంధనలను బేఖాతర్ చేయడం జరుగుతోంది. TGMDCL (తెలంగాణ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) నిర్లక్ష్యంతో వీణవంక మండలం కొండపాక , మల్లారెడ్డిపల్లి మరియు పోతిరెడ్డిపల్లి లోని ఇసుక రీచ్‌ల్లో హద్దులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల రీచ్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
లోతు ఎక్కడ ఆగుతోంది..?
మీటర్ మేరకే అనుమతించిన తవ్వకాలు వాస్తవంగా అనేక మీటర్లు లోతుగా సాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు వెలికితీస్తుండడం, జలదారుల ఏర్పాటుతో మానేరు నదికి సైతం ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్నారు. అక్రమ తవ్వకాల పట్ల అధికార యంత్రాంగం కనీసంగా స్పందించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చెరువు కట్టల మీదుగా రవాణా..!
మరొక ముఖ్యమైన అంశం – చెరువు కట్టల నుండి మరియు ఎస్సారెస్పీ కట్టల మీదుగా ఇసుక లారీలు రవాణా కావడం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎలాంటి అనుమతి ఇచ్చిందో స్పష్టత లేదు. భారీ వాహనాల రాకపోకలతో చెరువుల కట్టలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు. ఈ రవాణాను వెంటనే నిలిపివేయాలని, చెరువు కట్టల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ప్రశ్నలు మిగిలేలా…
ఇసుక రవాణా, తవ్వకాలపై బాధ్యత ఎవరిది? అధికారులు ఎందుకు స్పందించడం లేదు? పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వ విధానాలు కేవలం నామమాత్రమేనా? — ఇవన్నీ సమాధానాల కోసం ఎదురు చూస్తున్న ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.

