
అల్ఫోర్స్లో ఘనంగా తెలంగాణ భాష దినోత్సవం
కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు, ఉత్తమ తెలుగు ఉపాధ్యాయులకు సత్కారం
కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో ఏసీ కళాశాలలో మంగళవారం తెలంగాణ భాష దినోత్సవం మరియు కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డా. అశ్విని తానాజీ వకాడే ముఖ్య అతిథిగా హాజరై కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “కాళోజీ తెలంగాణ ఉద్యమానికి ప్రతీక. ఆయన రచనలు, పోరాట పటిమ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించాయి. యువత ఆయన స్ఫూర్తిని అనుసరించి సమాజాభివృద్ధికి కృషి చేయాలి” అని అన్నారు.
అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రజా కవి కాళోజీ సాహిత్య ప్రపంచానికి, సమాజానికి చేసిన సేవలు అపారమైనవి. అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో కాళోజీ జయంతిని ప్రతి సంవత్సరం ఘనంగా జరపడం ఆనవాయితీ. ఈసారి తెలంగాణ భాషాభివృద్ధికి కృషి చేస్తున్న ఉత్తమ తెలుగు ఉపాధ్యాయులను సన్మానించడం గర్వకారణం” అని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ప్రముఖ కవి కెప్టెన్ డా. మధుసూదన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం, అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయులకు ఘనంగా సత్కారం అందించారు.
వేడుకల్లో ఉపాధ్యాయులు ఆలపించిన తెలంగాణ జానపద గేయాలు, పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే కవితలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
