కుల వివక్ష ఆరోపణలు.. గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్‌పై చర్యలు కోరిన గ్రామస్తులు

వీణవంక, జూన్ 2(Zindagi9news): కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని నర్సింహులపల్లి గ్రామంలో కుల వివక్షకు సంబంధించిన ఆరోపణలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన వంతడుపుల పోచమ్మ ఇటీవల మరణించగా, ఆమె అంత్యక్రియల కోసం గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను వినియోగించేందుకు కుటుంబ సభ్యులు గ్రామ సర్పంచ్‌ను సంప్రదించినట్లు తెలిసింది.
సర్పంచ్ అనుమతి ఇచ్చినప్పటికీ, ట్రాక్టర్ డ్రైవర్ కందం కిషన్‌రావు వాహనం నడిపేందుకు నిరాకరించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కులం పేరుతో అవమానకరంగా మాట్లాడటంతో పాటు, ట్రాక్టర్ నడపబోనని చెప్పినట్లు బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని తెలిపారు.
సంఘటనపై సమాచారం అందుకున్న అంబేద్కర్ సంఘం నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, విధుల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వంతడుపుల బాబు మాట్లాడుతూ, కుల వివక్షకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. హుజురాబాద్ ఏసీపీ, కరీంనగర్ పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, అంబేద్కర్ సంఘం నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కార్యదర్శి మాడ్గుల ఓదెలు, వంతడుపుల అరుణ్, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
