మీసేవ కేంద్రాల్లో యూరియా బుకింగ్ సేవలు ప్రారంభం రైతులకు మరింత సులభంగా సబ్సిడీ యూరియా అందించనున్న ప్రభుత్వం

హైదరాబాద్, జూలై 8 (Zindagi9news): రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరియా అందుబాటును మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వ్యవసాయశాఖ ప్రకటించింది. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోలేని రైతులు సమీప మీసేవ కేంద్రాన్ని సందర్శించి ఆపరేటర్ సహాయంతో యూరియాను బుక్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని మీసేవ విభాగం, వ్యవసాయశాఖ సంయుక్తంగా అమలు చేస్తున్నాయి.
రైతులు పట్టాదారు పాస్‌బుక్ (PPB) నంబర్‌తో మీసేవ కేంద్రానికి వెళ్లి, సాగు విస్తీర్ణం, పంట వివరాలను నమోదు చేయించాలి. అనంతరం అవసరమైన యూరియా పరిమాణాన్ని ఎంపిక చేసిన ఎరువుల డీలర్ వద్ద బుక్ చేస్తారు. రైతు నమోదిత మొబైల్‌కు వచ్చే ఓటీపీని ధృవీకరించిన వెంటనే బుకింగ్ ఐడీ జారీ అవుతుంది.
మీసేవ ద్వారా పొందిన బుకింగ్ ఐడీ బుకింగ్ చేసిన తేదీని మినహాయించి 48 గంటల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుందని అధికారులు తెలిపారు. ఈ గడువులోపు రైతులు ఎంపిక చేసిన డీలర్ వద్ద నుంచి యూరియాను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేవలం రూ.10 సేవా రుసుముతో ఈ సేవను పొందవచ్చని, రైతులు తమ పట్టాదారు పాస్బుక్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ యాక్టివ్‌లో ఉండేలా చూసుకోవాలని వ్యవసాయశాఖ సూచించింది. సందేహాల నివృత్తి కోసం వ్యవసాయ విస్తరణ అధికారి (AEO), మండల వ్యవసాయ అధికారి (MAO) లేదా సమీప మీసేవ కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
