
దేశంలో 100 కొత్త విమానాశ్రయాలు.. ‘ఉడాన్ 2.0’కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
రూ. 28,840 కోట్ల వ్యయం – మారుమూల ప్రాంతాలకు విమాన సౌకర్యం – ఉపాధి, పర్యాటకానికి ఊతం
న్యూఢిల్లీ, మార్చి 25 (Zindagi9News) : దేశంలో విమానయాన రంగాన్ని మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మారుమూల ప్రాంతాలకు కూడా విమాన ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ‘ఉడాన్ 2.0’ (UDAN 2.0) పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ పథకం కింద దేశవ్యాప్తంగా కొత్తగా 100 విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ భారీ ప్రాజెక్టు కోసం రూ. 28,840 కోట్ల నిధులను కేటాయించనుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
‘ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్’ (UDAN) పథకం తొలి దశ విజయవంతం కావడంతో, దానిని మరింత విస్తరించే ఉద్దేశంతో రెండో దశ ‘ఉడాన్ 2.0’ను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు సేవలు లేని లేదా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో విమాన సౌకర్యాలు కల్పించనున్నారు.
దీంతో సాధారణ ప్రజలకు కూడా తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం అందుబాటులోకి రానుంది. అలాగే పర్యాటక రంగం అభివృద్ధి చెందడమే కాకుండా, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. మౌలిక వసతులు మెరుగుపడటంతో ప్రాంతీయ అభివృద్ధికి కూడా ఇది దోహదం చేయనుంది.
