
పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు: సీపీ సజ్జనర్
60 రోజులకు సరిపడా నిల్వలు – ఫుల్ ట్యాంక్ హడావిడి వద్దు – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
హైదరాబాద్, మార్చి 25(Zindagi9News): నగరంలో ఇంధన కొరత ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.
ఇంధన సరఫరాపై ఏర్పడిన అపోహల నేపథ్యంలో బుధవారం టీజీసీసీసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హరిచందన, అదనపు సీపీ తప్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ శ్వేత మరియు సివిల్ సప్లై అధికారులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయని, నగరవ్యాప్తంగా ఇంధన సరఫరా నిరాటంకంగా జరుగుతోందన్నారు. ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు చేరుకొని వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల డిమాండ్ అకస్మాత్తుగా పెరిగి, కొన్ని చోట్ల తాత్కాలికంగా ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయని తెలిపారు. దీనిని కొరతగా భావించవద్దని సూచించారు.
తప్పుడు ప్రచారాల ప్రభావంతో ఈ నెల 22 న 3,024 కిలోలీటర్ల ఇంధనం అమ్ముడవగా, 23న అది రెట్టింపై 6,400 కిలోలీటర్లకు చేరిందని చెప్పారు. ప్రజలు భయాందోళన చెందడం వల్లే ఈ స్థాయిలో అమ్మకాలు పెరిగినట్లు పేర్కొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లు, డబ్బాల్లో లూజ్ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తూ ప్రజలను భయపెట్టే వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు.
కమిషనరేట్ పరిధిలోని 240 పెట్రోల్ బంకుల్లో పరిస్థితిని సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ ఆయిల్ సంస్థలు, సివిల్ సప్లై అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం జిల్లా పరిధిలోని 186 బంకుల్లో ఇంధన సరఫరా సజావుగా కొనసాగుతోందని, ప్రజలు అనవసరంగా బంకుల వద్ద రద్దీ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
నిత్యావసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, క్షేత్రస్థాయిలో యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు. ప్రజలు వాస్తవాలను గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
