ప్రజావాణి పేరుకేనా? అధికారుల నిర్లక్ష్యంపై సాయికుమార్ తీవ్ర నిరసన

నిజామాబాద్ రూరల్ (ధర్పల్లి), అక్టోబర్ 19 (జిందగీ 9 న్యూస్): ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని, ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించడం లేదని బాధితుడు జి. సాయికుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు సంబంధిత ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించి తనకు న్యాయం చేయాలని కోరారు.
ఈ నెల 12న ధర్పల్లి మండల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఫిర్యాదు చేసినట్లు సాయికుమార్ తెలిపారు. అయితే, ఇప్పటివరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి గానీ, ఇతర అధికారులు గానీ తనకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రజావాణి కార్యక్రమం కేవలం పేరుకే పరిమితమైందని విమర్శించారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారుల్లో చలనం లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. తన సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యానికి కారణమైన పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించడం తమ వల్ల కాదని అధికారులు భావిస్తే, ఆ విషయాన్ని బహిరంగంగా తెలియజేయాలని అన్నారు.
అధికారులు వెంటనే స్పందించకపోతే విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఎంపీడీవో కార్యాలయం, గ్రామ పంచాయతీ కార్యాలయాల ముట్టడికి అనుమతి ఇవ్వాలని లేదా తదుపరి పోరాటానికి సంబంధించిన మార్గాలను తెలియజేయాలని తన వినతిపత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు.
అధికారుల నిర్లక్ష్య వైఖరి, రాజకీయ ఒత్తిళ్లపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, తన సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని బాధితుడు జి. సాయికుమార్ కోరారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
