బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు మొండిచేయి.. ఏపీకి రెండు పదవులు

న్యూఢిల్లీ, ఆగస్టు 17 (Zindagi9news): భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నూతన జాతీయ పదాధికారుల జాబితాను విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రకటించిన ఈ జాబితాలో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన నేతలకు జాతీయ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఇతర కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే తెలంగాణకు చెందిన ఒక్క నేతకు కూడా తాజా జాతీయ పదాధికారుల జాబితాలో చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది.
పార్టీ జాతీయ స్థాయిలో తెలంగాణలో విస్తరణపై దృష్టి సారిస్తున్న సమయంలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం లేకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో తెలంగాణకు చెందిన పలువురు నేతలు బీజేపీ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఏపీకి రెండు కీలక పదవులు
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం రెండు కీలక బాధ్యతలు దక్కాయి. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అలాగే విష్ణువర్ధన్ రెడ్డికి జాతీయ ఆల్ సెల్స్ జాయింట్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు.
దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం
కొత్త జాతీయ బృందంలో కేరళ నుంచి కె. సురేంద్రన్, అనిల్ ఆంటోనీ, కర్ణాటక నుంచి ప్రొఫెసర్ ఎం. నాగరాజ, తమిళనాడు నుంచి డాక్టర్ ఎం. వెంకటేశన్ తదితరులకు అవకాశం లభించింది. దీంతో దక్షిణాది రాష్ట్రాలకు పలు కీలక పదవులు దక్కగా, తెలంగాణకు మాత్రం ప్రాతినిధ్యం లేకపోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
కొత్త జాతీయ టీమ్‌లో రామ్ మాధవ్, బైజయంత్ జయ్ పాండా, డి. పురందేశ్వరి తదితరులు జాతీయ ఉపాధ్యక్షులుగా, వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, స్మృతి ఇరానీ తదితరులు జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమితులయ్యారు. బీఎల్ సంతోష్ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్)గా కొనసాగనున్నారు.
తెలంగాణకు జాతీయ స్థాయిలో తదుపరి దశలో ఏదైనా ప్రత్యేక బాధ్యతలు లేదా ఇతర కీలక అవకాశాలు కల్పిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
