రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ

కామారెడ్డి, ఆగస్టు 20 (జిందగీ9న్యూస్): స్టేషన్ బెయిల్ ఇప్పించడంతో పాటు కేసులో చార్జిషీట్ దాఖలు చేసే సమయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.30 వేల లంచం తీసుకుంటున్న కామారెడ్డి జిల్లా రాజంపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ దువ్వల అంజనేయులు ఏసీబీకి చిక్కారు.
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడి కుమారుడికి స్టేషన్ బెయిల్ ఇప్పించడంతో పాటు కేసులో తదుపరి చర్యల్లో అనుకూలంగా వ్యవహరించేందుకు ఎస్ఐ రూ.30 వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆగస్టు 20న తన నివాసంలో లంచం మొత్తాన్ని స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ.30 వేల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
లంచం స్వీకరించిన ఎస్ఐను అరెస్ట్ చేసి హైదరాబాద్ నాంపల్లిలోని SPE & ACB కేసుల విచారణకు సంబంధించిన II అదనపు ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు ఏసీబీ వెల్లడించింది. కేసు దర్యాప్తులో ఉంది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
