అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో ఘనంగా ‘శ్రావణ శోభ’
శ్రావణ మాస ప్రాముఖ్యతను చాటేలా ప్రత్యేక పూజలు.. ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు

కరీంనగర్, ఆగస్టు 14 (Zindagi9News): కరీంనగర్ కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ‘శ్రావణ శోభ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శ్రీగౌరీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని మాసాల్లో శ్రావణ మాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఈ మాసంలో వివిధ పూజలు, దానధర్మాలు నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక ఫలితాలను పొందవచ్చని పేర్కొన్నారు. శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనదని, ఆలయాలను సందర్శించడం, పేదలు, బ్రాహ్మణులు, అవసరమైన వారికి దానధర్మాలు చేయడం ఈ మాసం ప్రత్యేకతల్లో భాగమని వివరించారు.
శ్రావణ మాసంలో శ్రీ వరలక్ష్మీ వ్రతం, నాగుల పంచమి, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణాష్టమి, శివారాధన, విష్ణు ఆరాధన, గౌరీదేవి పూజ వంటి పర్వదినాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారని ఆయన తెలిపారు.
శ్రావణ మాస ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేసేలా పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యంగా నృత్య ప్రదర్శనలు, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రాంగణాన్ని వివిధ రకాల పూలు, అలంకరణలతో తీర్చిదిద్దడంతో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
