
జమ్మికుంటలో విగ్రహాల పక్కనే వైన్‌షాపులు… 50–100 మీటర్ల దూరంలో మద్యం కేంద్రాలు – ప్రజల్లో ఆందోళన
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మద్యం దుకాణాల ఏర్పాటు పై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గాంధీ చౌరస్తాలో గాంధీ విగ్రహం కేవలం 50–100 మీటర్ల దూరంలోనే వైన్‌షాపు నడుస్తుండటం, అదే ప్రదేశంలో వైన్‌షాపు పక్కనే పోలీస్‌స్టేషన్ ఉండటం, ఆ తరువాత వెంటనే రైల్వే స్టేషన్ ఉన్న విషయం స్థానికుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. చట్టం, ప్రజాసేవ, రవాణా వ్యవస్థలు ఉన్న కీలక ప్రాంతంలో మద్యం దుకాణం కొనసాగడం ఎలా అనుమతించారో ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అంబేద్కర్ చౌరస్తాలో కూడా పరిస్థితి తేడా లేకుండా ఉంది. అంబేద్కర్ విగ్రహం అదే దూర పరిధిలోపే బార్ అండ్ రెస్టారెంట్, వైన్‌షాపు నడవడం ప్రజాభిప్రాయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని వారు పేర్కొన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యాసంస్థలు, దేవాలయాలు, ప్రజా విగ్రహాలు, పబ్లిక్ ప్రదేశాలకు కనీసం 100 మీటర్ల దూరంలో మద్యం విక్రయ కేంద్రాలు ఉండాలనే నిబంధన స్పష్టంగా ఉన్నప్పటికీ ఇవి బహిరంగంగా ఉల్లంఘించబడుతున్నాయంటూ ప్రజలు మండిపడుతున్నారు.
వీణవంక రోడ్డులో కొత్తగా ఏర్పాటైన వైన్‌షాపు డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, పాఠశాలలు, ఆలయాలకు అత్యంత సమీపంలో ఉండటం మరో వివాదంగా మారింది. ఈ మార్గంలో రోజూ ప్రయాణించే విద్యార్థులు, మహిళలు అసౌకర్యం గురవుతున్నారని నివాసితులు చెబుతున్నారు.
కొత్తపల్లి ప్రధాన రహదారి లో వైన్‌షాపులు ఉండటం కూడా రాత్రివేళ రవాణా, భద్రతా సమస్యలను పెంచుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ పరిస్థితుల్లో ప్రజలు ఒక్కటే ప్రశ్న లేవనెత్తుతున్నారు—
“పట్టణంలో ఈ స్థాయి సమస్య ఉన్నా… మన ప్రజా ప్రతినిధులు, అధికారులు, సామాజిక కార్యకర్తలు ఎందుకు స్పందించడం లేదు?”
విగ్రహాల పక్కనే, విద్యాసంస్థల దగ్గర, పోలీస్‌స్టేషన్ సమీపంలో, రైల్వే స్టేషన్ పక్కనే మద్యం కేంద్రాల నడపడం సమాజ ప్రయోజనాలకు విరుద్ధం అని పేర్కొంటూ పట్టణ ప్రజలు అధికారులు వెంటనే చర్యలు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వైన్‌షాపులను పునఃపరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
