
ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణం వైపు అడుగులు
జమ్మికుంట : వరల్డ్ ఎయిడ్స్ డేను పురస్కరించుకుని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది మరియు విస్డం కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ సంయుక్తంగా సోమవారం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పురవీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో “హెచ్ఐవి నివారణ మనందరి బాధ్యత”, “కండోమ్ వాడండి – హెచ్ఐవి నివారించండి”, “సురక్షిత శృంగారం–జీవితం బంగారం”, “యువత జాగ్రత్త… హెచ్ఐవి గురించి తెలుసుకో” వంటి నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. ర్యాలీ గాంధీ చౌరస్తా వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా డాక్టర్ చందన, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, ప్రిన్సిపాల్ విజేందర్ రెడ్డి మాట్లాడుతూ— హెచ్ఐవి వైరస్ రోగనిరోధక శక్తిని తగ్గిస్తుందని, అసురక్షిత శృంగారం, కలుషిత రక్త మార్పిడి, కలుషిత సూదులు, సిరంజిల వాడకం ద్వారా వ్యాపిస్తుందని తెలిపారు. ఎయిడ్స్ బాధితులపై వివక్ష చూపరాదని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో డాక్టర్ మొలుగు చందన, డాక్టర్ సంధ్యారాణి, హెల్త్ సూపర్వైజర్ అరుణ, సదానందం, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
