భూ భారతి రిపోర్ట్ కోసం రూ. 10,000 లంచం.. ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీమాన్!

పెద్దపల్లి జిల్లా, ఏప్రిల్ 09(zindagi9news):
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కారు. భూమికి సంబంధించిన క్షేత్రస్థాయి విచారణ నివేదిక ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ (RI) శ్రీమాన్‌ను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అంతర్గాం మండలానికి చెందిన ఫిర్యాదుదారుడు తన తల్లి పేరు మీద ఉన్న భూమికి సంబంధించి ‘భూ భారతి చట్టం-2025’ కింద క్షేత్రస్థాయి విచారణ (Field Enquiry) జరిపి, తహసీల్దార్‌కు నివేదిక సమర్పించాలని ఆ మండల RI సెడంక శ్రీమాన్‌ను కోరారు. అయితే, ఈ పని చేసేందుకు శ్రీమాన్ రూ. 10,000/- లంచం డిమాండ్ చేశారు.
బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా, పక్కా పథకం ప్రకారం గురువారం తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శ్రీమాన్‌ను చుట్టుముట్టారు. నిందితుడి నుంచి నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
