ప్రజా భద్రతకు ప్రజల సహకారమే బలం.. ఇల్లందకుంటలో సీసీ కెమెరాల ప్రారంభం: సీపీ గౌష్ ఆలం
వనమహోత్సవంలో మొక్కలు నాటిన సీపీ
విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ
ఇల్లందకుంట పోలీస్ స్టేషన్, జమ్మికుంట రూరల్ సర్కిల్ కార్యాలయాల వార్షిక తనిఖీ

కరీంనగర్, జూలై 21 (Zindagi9News): ప్రజా భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, పోలీసింగ్‌లో ప్రజల భాగస్వామ్యమే విజయానికి మూలమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అన్నారు. మంగళవారం ఇల్లందకుంట మండలంలో పర్యటించిన ఆయన ప్రజా భద్రత, పర్యావరణ పరిరక్షణ, రోడ్డు భద్రత, విద్యార్థుల అవగాహన కార్యక్రమాలతో పాటు పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీలు నిర్వహించారు.
ఇల్లందకుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా నిఘా వ్యవస్థను ప్రారంభించిన సీపీ, గ్రామాల్లో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటు విస్తరించాలని పిలుపునిచ్చారు. అనంతరం వనమహోత్సవ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వివరించారు.
విద్యార్థులకు అత్యవసర పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్లు ముద్రించిన ఎగ్జామ్ ప్యాడ్లను పంపిణీ చేసిన సీపీ, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేస్తూ హెల్మెట్ ధరించడం ప్రాణరక్షణకు అత్యంత అవసరమని చెప్పారు.
ప్రజలతో మాట్లాడుతూ మాదకద్రవ్యాలు, జూదం, సైబర్ నేరాలు, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఇతర అక్రమ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం ఇల్లందకుంట పోలీస్ స్టేషన్, జమ్మికుంట రూరల్ సర్కిల్ కార్యాలయాల్లో వార్షిక తనిఖీలు నిర్వహించి పెండింగ్ కేసులు, రికార్డులు, దర్యాప్తు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో వేగం పెంచాలని, నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అలాగే ప్రతిపాదిత ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందేలా నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమాల్లో హుజూరాబాద్ ఏసీపీ మాధవి, హుజూరాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, జమ్మికుంట రూరల్ ఇన్స్పెక్టర్ వెంకట్, ఇల్లందకుంట ఎస్సై క్రాంతికుమార్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.
