పోలీసు సంక్షేమానికి పెద్దపీట.. ప్రతి అర్హుడికి పథకాల ఫలాలు అందాలి: డీజీపీ సి.వి. ఆనంద్
పోలీస్ వెల్ఫేర్, ఆరోగ్య భద్రత పథకాలపై సమగ్ర సమీక్ష
విద్య, వైద్యం, రుణాలు, బీమా పథకాల బలోపేతానికి ఆదేశాలు
సంక్షేమ సేవల్లో డిజిటలైజేషన్, పారదర్శకతకు ప్రాధాన్యం

హైదరాబాద్, జూలై 20 (Zindagi9News): తెలంగాణ పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమమే శాఖ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ స్పష్టం చేశారు. సోమవారం డీజీపీ కార్యాలయంలో పోలీస్ వెల్ఫేర్ సొసైటీ, ఆరోగ్య భద్రత పథకాల అమలుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పోలీసు పిల్లలకు మెరిట్ స్కాలర్షిప్లు, జేఈఈ, నీట్, సివిల్స్ తదితర పోటీ పరీక్షలకు ప్రత్యేక ప్రోత్సాహం, విద్యా సహాయం అందిస్తున్నామని తెలిపారు. అలాగే సిబ్బందికి వివాహ, విద్య, వైద్య రుణాలతో పాటు అదనపు బీమా రక్షణ, వివిధ గ్రాంట్ల ద్వారా సమగ్ర ఆర్థిక భద్రత కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
ఆరోగ్య భద్రత పథకం ద్వారా 2025లో 33,126 మంది పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యులకు రూ.181.74 కోట్లతో వైద్య సేవలు అందించగా, 2026 జూన్ నాటికి 12,392 మందికి రూ.73.61 కోట్ల వ్యయంతో చికిత్స అందించినట్లు తెలిపారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన పోలీసుల కుటుంబాలకు హోదాను బట్టి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
సంక్షేమ పథకాల దుర్వినియోగాన్ని ఏమాత్రం సహించబోమని హెచ్చరించిన డీజీపీ, ప్రతి అర్హుడికి న్యాయంగా సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ వెల్ఫేర్ సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేసి పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించాలని సూచించారు. పోలీస్ క్యాంటీన్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని పోలీసు పిల్లల విద్య, స్కాలర్షిప్లు, కోచింగ్, వివాహ సహాయం వంటి సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలని అధికారులకు సూచించారు.
అర్హులైన పోలీసు సిబ్బందికి తక్కువ వడ్డీతో గృహ, ఓపెన్ ప్లాట్, వ్యక్తిగత, విద్యా, వివాహ రుణాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. ప్రతి రూపాయి జవాబుదారీతనంతో ఖర్చు కావాలని, పారదర్శకత, నైతికతతో సంక్షేమ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు, తెలంగాణ పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
