
పెద్దపల్లిలో మే 6న మెగా జాబ్ డ్రైవ్ – 3,439 ఉద్యోగ అవకాశాలు
పెద్దపల్లి, మే 1 (zindagi9news):
జిల్లా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పెద్దపల్లి జిల్లా పరిపాలన యంత్రాంగం కీలక చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో మే 6న మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడించారు.
వెంకట పద్మ A/C ఫంక్షన్ హాల్ (RTO ఆఫీస్ ఎదురుగా) లో జరగనున్న ఈ జాబ్ డ్రైవ్‌ను TASK మరియు DEET సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో సుమారు 68 ప్రముఖ సంస్థలు పాల్గొనగా, మొత్తం 3,439 ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
టెలికాం & కమ్యూనికేషన్, కస్టమర్ సపోర్ట్ & BPO, సేల్స్ & మార్కెటింగ్, డిజిటల్ సర్వీసెస్, ఫీల్డ్ ఆపరేషన్స్ వంటి విభిన్న రంగాల్లో అభ్యర్థులకు అవకాశాలు లభించనున్నాయి. యువతను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, వారికి నేరుగా ఉపాధి కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
TASK మరియు DEET ద్వారా శిక్షణ పొందిన పలువురు ఇప్పటికే ఇలాంటి జాబ్ డ్రైవ్‌ల ద్వారా మంచి ఉద్యోగాలను పొందినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ, ఇంజనీరింగ్, MBA అర్హతలు కలిగిన యువకులు, యువతులు తమ రెజ్యూమ్‌లతో హాజరుకావాలని, అలాగే DEET పోర్టల్‌లో ముందస్తుగా నమోదు చేసుకుని అప్లై చేయాలని సూచించారు.
యువత ఉపాధి పొందడం ద్వారా వారి కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడటమే కాకుండా, జిల్లా సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఈ దిశగా జిల్లా పరిపాలన యంత్రాంగం పూర్తి మద్దతు అందిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
