ఓటరు జాబితాలో లోపాలు వెంటనే సరిదిద్దాలి: సీఈఓ సి. సుదర్శన్ రెడ్డి
ఎస్ఐఆర్ ప్రక్రియపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
ASDD కేసుల పునఃపరిశీలన, డిజిటైజేషన్లో ఖచ్చితత్వంపై ఆదేశాలు
85 ఏళ్లు పైబడిన ఓటర్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచన

హైదరాబాద్, ఆగస్టు 3 (Zindagi9News): రాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫొటోలు లేకపోవడం, జన్మతేదీల్లో వ్యత్యాసాలు, లింగ వివరాల్లో పొరపాట్లు, సంతకాలలో లోపాలు వంటి అంశాలను వెంటనే సరిచేసి సమాచారాన్ని దోషరహితంగా నమోదు చేయాలని సూచించారు.
సోమవారం అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, డిజిటైజేషన్ పురోగతి, గైర్హాజరు (Absent), నివాసం మార్చుకున్న (Shifted), మరణించిన (Dead), నకిలీ (Duplicate) ఓటర్ల (ASDD) జాబితాల పరిశీలన, No Mapping కేసులు తదితర అంశాలను సమీక్షించారు.
అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా, అనర్హులు జాబితాలో ఉండకుండా క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని సీఈఓ ఆదేశించారు. అవసరమైతే Roll-back సదుపాయాన్ని వినియోగించి రికార్డులను తిరిగి పరిశీలించి సవరణలు చేయాలని సూచించారు. బూత్ లెవల్ అధికారులు (BLOలు), సూపర్వైజర్లు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు (AEROs) క్షేత్రస్థాయి ధృవీకరణను మరింత పటిష్ఠంగా నిర్వహించాలని, నిర్లక్ష్యం కనబడితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
అలాగే, BLOల సమావేశాల మినిట్స్‌ను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్ల (BLAలు) సంతకాలతో సిద్ధం చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. 85 సంవత్సరాలు దాటిన ఓటర్ల వివరాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి, వారి సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని, ఒకే కుటుంబ సభ్యులు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ సాధారణ పరిపాలన (ఎన్నికలు) శాఖ అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
