రూ.263.25 కోట్లతో తెలంగాణలో 107 తహసీల్దార్, 10 ఆర్డీవో కార్యాలయాలకు కొత్త భవనాలు
తెలంగాణలో 117 రెవెన్యూ కార్యాలయాలకు కొత్త భవనాలు.. రూ.263.25 కోట్లకు ప్రభుత్వం ఆమోదం

హైదరాబాద్, జూన్ 27 (జిందగీ9న్యూస్): రాష్ట్రంలో అద్దె భవనాలు, శిథిలావస్థలో ఉన్న రెవెన్యూ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 10 ఆర్డీవో కార్యాలయాలు, 107 తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి రూ.263.25 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కార్యాలయ భవన నిర్మాణానికి రూ.2.25 కోట్ల చొప్పున నిధులు కేటాయించగా, నిర్మాణ బాధ్యతలను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించింది. భూముల పరిపాలన ప్రధాన కమిషనర్ అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
కొత్త భవనాలు నిర్మించనున్న తహసీల్దార్ కార్యాలయాల జాబితాలో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జనగామ, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట, ఖమ్మం, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్–మల్కాజిగిరి, ములుగు, నాగర్‌కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల తహసీల్దార్ కార్యాలయాలు ఉన్నాయి. అలాగే జగిత్యాల, మెట్పల్లి, గద్వాల్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మల్కాజిగిరి, మంథని, వేములవాడ, సిరిసిల్ల తదితర ప్రాంతాల్లో కొత్త ఆర్డీవో కార్యాలయ భవనాలు కూడా నిర్మించనున్నారు.
ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించడంతో పాటు, సిబ్బందికి ఆధునిక వసతులు కల్పించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది.


Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
