కోరపల్లిలో విషాదం.. బావిలో పడి కూలీ మృతి, నిర్లక్ష్యంపై కేసు నమోదు

జమ్మికుంట, జూన్ 29(Zindagi9news): కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి బావిలో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరపల్లి గ్రామానికి చెందిన కొండవీన పోశాలు (55) ఈ నెల 28న ఉదయం సుమారు 10.30 గంటలకు గ్రామానికి చెందిన గీరవేనా కొమురయ్య అలియాస్ టవర్ కొమురయ్య ఇంటి వద్ద పని ఉందని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. అనంతరం మధ్యాహ్నం సమయంలో పోశాలు కొమురయ్య ఇంటి ఆవరణలోని చేదబావిలో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహాయంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు బావిలో నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి భార్య కొండవీన పద్మ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. గీరవేనా కొమురయ్య, అతని కుమారుడు గీరవేనా శ్రీనివాసులు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండా బావిలో మోటారు తీయడానికి తన భర్తను దింపారని, దీంతో కరెంట్ షాక్కు గురై బావిలో పడి నీటిలో మునిగి మృతి చెందాడా లేదా ఇతర కారణాల వల్ల మరణించాడా అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి, వారి నిర్లక్ష్యం వల్లే తన భర్త మృతి చెందినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
కూతుళ్లు, అల్లుళ్లు వచ్చిన అనంతరం ఫిర్యాదు ఇవ్వడంతో కొంత ఆలస్యమైందని ఫిర్యాదుదారురాలు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
