ఉద్యోగం నుంచి తొలగించారనే కక్ష.. రూ.20 లక్షల కోసం ఐదేళ్ల చిన్నారి హత్య!
మల్కాజిగిరి సీపీ బి. సుమతి వెల్లడి.. 10 ప్రత్యేక బృందాలతో 24 గంటల్లో కేసు ఛేదన

మల్కాజిగిరి: కౌకూర్‌లోని విల్లా ఆర్కిడ్స్ గేటెడ్ కమ్యూనిటీలో ఐదేళ్ల చిన్నారి హత్య కేసును మల్కాజిగిరి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో బీహార్‌కు చెందిన మాజీ సెక్యూరిటీ గార్డు విక్రమ్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ సోమవారం వెల్లడించారు. పోలీస్ కమిషనర్ బి. సుమతి తెలిపిన వివరాలు ప్రకారం.. ఉద్యోగం నుంచి తొలగించారనే కక్షతో పాటు, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో చిన్నారిని కిడ్నాప్ చేసి రూ.20 లక్షలు వసూలు చేయాలని నిందితుడు కుట్ర పన్నినట్లు ఆమె తెలిపారు.
విక్రమ్ కుమార్ గతంలో విల్లా ఆర్కిడ్స్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. ఆ సమయంలో అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో చిన్నారి తాత మందలించినట్లు సీపీ వివరించారు. అనంతరం నివాస సముదాయ కమిటీ అతడిని ఉద్యోగం నుంచి తొలగించడంతో కక్ష పెంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు.
అక్టోబర్ 10వ తేదీ సాయంత్రం చిన్నారి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఆందోళనతో వెతుకుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి రూ.20 లక్షలు డిమాండ్ చేశాడు. పోలీసుల దర్యాప్తు ప్రకారం చిన్నారి నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు, కాళ్లు కట్టివేసి క్లబ్‌హౌస్ సెల్లార్‌లోని నీటి సంపులో పడేసినట్లు విచారణలో వెల్లడైందని సమాచారం.
అక్టోబర్ 11వ తేదీ తెల్లవారుజామున చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. కేసును ఛేదించేందుకు పది ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ ఫోన్ కాల్ వివరాలు, సెల్ టవర్ ఆధారాలను విశ్లేషించి నిందితుడిని గుర్తించినట్లు వెల్లడించారు. సుమారు 130 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించినట్లు పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి విచారించగా కేసుకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన నేపథ్యంలో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో భద్రతను మరింత పటిష్ఠం చేసుకోవాలని సీపీ బి. సుమతి సూచించారు. సెక్యూరిటీ గార్డులు, డ్రైవర్లు, వాచ్మెన్లు, గృహ సహాయకుల వివరాలను స్థానిక పోలీసుల ద్వారా ధృవీకరించుకోవాలని కోరారు. ‘మీ సురక్ష’ కార్యక్రమం ద్వారా సిబ్బంది వివరాలను నమోదు చేయించుకోవాలని, ‘నేను సైతం 2.0’ కార్యక్రమం ద్వారా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి అవి నిరంతరం పనిచేసేలా చూడాలని సూచించారు. నేరాల నివారణకు ప్రజలు పోలీసులతో సమన్వయం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
