రైలు ప్రమాద మృతుడి గుర్తింపు: హుజురాబాద్ వ్యక్తిగా నిర్ధారణ

జమ్మికుంట, మార్చి 17(zindagi9news): జమ్మికుంట రైల్వే ఫ్లైఓవర్ సమీపంలో సోమవారం జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వివరాలు ఎట్టకేలకు లభ్యమయ్యాయి. మృతుడిని హుజురాబాద్ పట్టణం మామిండ్లవాడకు చెందిన గొర్రె మొగిలి (60) గా పోలీసులు గుర్తించారు.
ఘటన వివరాలు:
సోమవారం ఉదయం పట్టాలు దాటుతుండగా మొగిలిని రాజధాని ఎక్స్ప్రెస్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన ముఖం, తల పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో గుర్తుపట్టడం సాధ్యపడలేదు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేకపోవడంతో తొలుత పోలీసులు అజ్ఞాత వ్యక్తిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.
కుటుంబ సభ్యుల గుర్తింపు:
పోలీసుల విచారణలో భాగంగా మృతుడి కోడలు గొర్రె రాణి ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని మొగిలిగా గుర్తించారు. మృతుడు షేటర్లకు గ్రీస్ వర్క్ చేస్తూ జీవనం సాగించేవారని కుటుంబ సభ్యులు తెలిపారు.
రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జి. తిరుపతి ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు నిర్వహించారు. మంగళవారం పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు.
