ఆయుష్ జూనియర్ డాక్టర్లకు భారీ ఊరట.. స్టైఫండ్ భారీగా పెంపు

హైదరాబాద్, సెప్టెంబర్ 10: తెలంగాణలోని ప్రభుత్వ ఆయుష్ విద్యాసంస్థల్లో చదువుతున్న హౌస్ సర్జన్లు, పీజీ వైద్య విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా ఆయుష్ వైద్య విద్యార్థుల స్టైఫండ్‌ను సవరించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తు G.O.Rt.No.356 ఉత్తర్వులు జారీ చేశారు.
28 రోజుల సమ్మెకు ఫలితం
అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆయుష్ జూనియర్ డాక్టర్ల జేఏసీ ఆధ్వర్యంలో ఆగస్టులో దాదాపు 28 రోజుల పాటు నిరసనలు, సమ్మె నిర్వహించారు. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహతో జరిగిన చర్చల్లో ప్రభుత్వం స్టైఫండ్ పెంపుపై హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి.
హౌస్ సర్జన్ల స్టైఫండ్ రెట్టింపునకు చేరువ
ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నేచురోపతి విభాగాలకు చెందిన 405 మంది హౌస్ సర్జన్లకు ప్రయోజనం కలగనుంది. ఇప్పటివరకు నెలకు రూ.13,754గా ఉన్న స్టైఫండ్‌ను రూ.29,792కు పెంచారు.
ఇందులో 126 మంది ఆయుర్వేద, 125 మంది హోమియోపతి, 94 మంది యునాని, 60 మంది నేచురోపతి విద్యార్థులు ఉన్నారు.
పీజీ విద్యార్థులకు కూడా భారీ పెంపు
మూడు సంవత్సరాల పీజీ కోర్సులు చదువుతున్న 393 మంది విద్యార్థుల స్టైఫండ్‌ను కూడా ప్రభుత్వం గణనీయంగా పెంచింది. మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.30,947 నుంచి రూ.67,032కు, రెండో సంవత్సరం విద్యార్థులకు రూ.32,665 నుంచి రూ.70,757కు, మూడో సంవత్సరం విద్యార్థులకు రూ.34,385 నుంచి రూ.74,482కు పెంచారు.
ఈ ఉత్తర్వులతో ప్రభుత్వ ఆయుష్ విద్యాసంస్థల్లో చదువుతున్న మొత్తం 798 మంది హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయుష్ విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపాయి.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
