ప్రభుత్వ ఆస్పత్రుల్లో వంధ్యత్వ చికిత్స సేవల విస్తరణ
ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లపై కఠిన నిఘా: మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, జూలై 3(Zindagi9news): తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వంధ్యత్వ (ఇన్ఫెర్టిలిటీ) చికిత్స సేవలను విస్తరించాలని, ప్రతి దంపతికి నాణ్యమైన సంతానోత్పత్తి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అనుభవజ్ఞులైన గైనకాలజిస్టుల సేవలను వినియోగించుకొని ప్రత్యేక ఫెర్టిలిటీ ఓపీ (ఔట్‌పేషెంట్) క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి ఆసక్తి గల గైనకాలజిస్టు వారానికి కనీసం ఒక రోజు ఫెర్టిలిటీ ఓపీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గాంధీ ఆస్పత్రి, పేట్లబుర్జ్ ఆస్పత్రిలో 2024లో ప్రారంభించిన ఐవీఎఫ్ కేంద్రాల పనితీరును సమీక్షించిన మంత్రి, ఇప్పటివరకు సుమారు 37,300 మంది రోగులకు సేవలు అందించినట్లు అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఐవీఎఫ్ చికిత్స పొందిన 23 మంది మహిళలు గర్భం దాల్చగా, 510 మందికి ఐయూఐ చికిత్స పూర్తైందని, మరో 490 జంటలకు ఐవీఎఫ్ చికిత్స కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ దశలవారీగా ఐవీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. యువతలో వంధ్యత్వానికి గల కారణాలు, ముందస్తు వైద్య చికిత్స అవసరం, అందుబాటులో ఉన్న చికిత్సలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ప్రైవేట్ ఫెర్టిలిటీ కేంద్రాలపై కఠిన నియంత్రణ ఉండాలని స్పష్టం చేసిన మంత్రి, ప్రతి కేంద్రాన్ని నెలకు కనీసం ఒకసారి తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించడం, అనైతిక కార్యకలాపాలకు పాల్పడటం లేదా రోగులను దోపిడీ చేయడం వంటి చర్యలకు పాల్పడే కేంద్రాలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 464 నమోదిత ఫెర్టిలిటీ కేంద్రాలు ఉండగా, నిబంధనల ఉల్లంఘనల కారణంగా 60 కేంద్రాలకు నోటీసులు జారీ చేసినట్లు, రెండు కేంద్రాల లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేయగా, మరో తొమ్మిది కేంద్రాల లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు అధికారులు సమావేశంలో వెల్లడించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
