
జమ్మికుంటలో డయాలసిస్ కేంద్ర ఏర్పాట్లపై అధికారుల పరిశీలన
జమ్మికుంట: తెలంగాణ రాష్ట్రంలో కిడ్నీ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్తగా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో జమ్మికుంట సామాజిక ఆరోగ్య కేంద్రానికి డయాలసిస్ కేంద్రం మంజూరు కావడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట రమణ, డి సి హెచ్ కృష్ణ ప్రసాద్, డిప్యూటీ డి ఎంహెచ్ ఓ డాక్టర్ శ్రవణ్ కుమార్ కలిసి శనివారం ఆసుపత్రిని సందర్శించారు.
డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పడకలు, తగిన స్థలం, గదులు, తాగునీటి సౌకర్యం వంటి అంశాలను వారు పరిశీలించారు. ఈ కేంద్రం ప్రారంభమైతే కిడ్నీ రోగులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగా డయాలసిస్ సేవలు పొందగలరని తెలిపారు.
అదేవిధంగా ఆసుపత్రిలో లేబర్ రూమ్, వార్డులు, రికార్డులను కూడా పరిశీలించిన అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి గర్భిణీకి మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధుల్లో అలసత్వం ప్రదర్శించవద్దని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సదానందం, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
