డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో రసాభాస.. మంత్రులు వర్సెస్ కౌశిక్ రెడ్డి
కమలాపూర్‌లో సభా వేదికపై వాగ్వాదం.. ‘అబద్ధాలు చెప్పొద్దు.. నిజాలు మాట్లాడాలి’ అంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహం

కమలాపూర్, ఆగస్టు 10 (Zindagi9news): హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమం రాజకీయ వాగ్వాదంతో రసాభాసగా మారింది. సభా వేదికపై మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది.
డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, పూర్తి చేసిన పనులకు సంబంధించి మంత్రులు మాట్లాడుతుండగా.. గత ప్రభుత్వం ఇళ్లను అసంపూర్తిగా వదిలివేసిందని, వాటిని పూర్తి చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం నిధులు కేటాయించిందని మంత్రులు పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
కమలాపూర్ మండలంలో పంపిణీ చేస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లను గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే నిర్మించారని కౌశిక్ రెడ్డి వాదించారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని రాజకీయ విమర్శలకు వేదికగా మార్చొద్దని, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని కోరారు.
ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి “అబద్ధాలు చెప్పొద్దు.. నిజాలు మాట్లాడాలి. ఇది రాజకీయాలు చేయాల్సిన వేదిక కాదు. ప్రజలకు వాస్తవాలు చెప్పండి” అంటూ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.
మంత్రులు, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదంతో సభా ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని బీఆర్ఎస్ కార్యకర్తలను బయటకు పంపించారు. దీంతో కొద్దిసేపు కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
