
హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సివిల్ సప్లైస్ శాఖ జిల్లా మేనేజర్ (టెక్నికల్) వి. నరసింహారావుపై అవినీతి నిరోధక శాఖ (ACB) కేసు నమోదు చేసింది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రస్తుతం మహబూబాబాద్‌లో జిల్లా మేనేజర్ (RDO)గా పనిచేస్తున్న ఆయన గతంలో ఖమ్మం కలెక్టరేట్లో విధులు నిర్వహించారు. అక్రమ మార్గాల్లో ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు 2026 అక్టోబర్ 9న అనుమానిత అధికారి, ఆయన బంధువులు, సన్నిహితులకు సంబంధించిన ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
సోదాల్లో ఖమ్మం జిల్లా బల్లేపల్లి, రఘునాథపాలెం, వెలుగుమట్ల ప్రాంతాల్లో మొత్తం 1,230.16 చదరపు గజాల విస్తీర్ణంలో ఐదు ఓపెన్ ప్లాట్లు గుర్తించారు. వీటి డాక్యుమెంట్ విలువ రూ.30.72 లక్షలుగా ఉంది. సూర్యాపేట జిల్లాలోని కల్మలచెరువు, సిరికొండ, నవమావరం ప్రాంతాల్లో వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు. సిరికొండలో సుమారు 21.3 ఎకరాలు, నవమావరంలో మొత్తం 10.62 ఎకరాల భూములకు సంబంధించిన వివరాలను ఏసీబీ వెల్లడించింది.
అలాగే ఖమ్మంలోని కావిరాజ్ నగర్, బైరామల్‌గూడలోని సాగర్ ఎన్క్లేవ్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో జీ+2, జీ+4 అంతస్తుల ఆర్సీసీ భవనాలు ఉన్నట్లు గుర్తించారు. వీటి డాక్యుమెంట్ విలువ మొత్తం రూ.1.58 కోట్లుగా పేర్కొన్నారు. మూడు వాహనాలతో పాటు గృహోపకరణాలు, సుమారు 360.97 గ్రాముల బంగారం, 331.58 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.15,600 నగదును గుర్తించినట్లు ఏసీబీ తెలిపింది.
ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల డాక్యుమెంట్ విలువ సుమారు రూ.9,41,06,975 (రూ.9.41 కోట్లు)గా ఉన్నట్లు ఏసీబీ వెల్లడించింది. స్థిరాస్తుల మార్కెట్ విలువ డాక్యుమెంట్ విలువ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఆస్తుల యాజమాన్యం, కొనుగోలుకు వినియోగించిన నిధుల మూలాలు, లావాదేవీలపై మరింత విచారణ కొనసాగుతోందని తెలిపింది. ఒక రైస్ మిల్లును బినామీ పేరుతో కొనుగోలు చేసి ఉండవచ్చనే అనుమానంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది.
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
