ఢిల్లీలో నిర్భయ ఘటనను తలపిస్తున్న దారుణం
స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్.. డ్రైవర్, కండక్టర్ అరెస్ట్

న్యూఢిల్లీ, ఆగస్టు 31: ఢిల్లీలో నిర్భయ ఘటనను తలపించే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 16 ఏళ్ల 11వ తరగతి విద్యార్థినిపై స్లీపర్ బస్సులో డ్రైవర్, కండక్టర్ అత్యాచారానికి పాల్పడినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆగస్టు 4 రాత్రి జరిగినట్లు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మైన్‌పురి జిల్లాకు చెందిన బాలిక తన బంధువును కలిసేందుకు నోయిడాకు బయలుదేరింది. భారీ వర్షం, చీకటి కారణంగా పొరపాటున గ్రేటర్ నోయిడాలోని పరిచౌక్ వద్ద దిగిపోయింది. ఆ సమయంలో ఖాళీగా వెళ్తున్న స్లీపర్ బస్సును ఆపి సహాయం కోరగా, బస్సు డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్ ఆమెను బస్సులోకి ఎక్కించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నోయిడా సెక్టార్-63 వైపు వెళ్తున్నామని చెప్పి బాలికను బస్సులోకి ఎక్కించుకున్న అనంతరం, బస్సు కదిలిన కొద్దిసేపటికే కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం డ్రైవర్, కండక్టర్ ఇద్దరూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, ప్రతిఘటించడంతో చంపుతామని బెదిరించారని ఆమె ఆరోపించింది.
బస్సు పరిచౌక్ నుంచి ఢిల్లీలోని కశ్మీర్ గేట్ వరకు సుమారు 47 కిలోమీటర్లు ప్రయాణించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కశ్మీర్ గేట్ సమీపంలోని రింగ్ రోడ్డుపై బాలికను దించి నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. బాధితురాలు కశ్మీర్ గేట్ పోలీసులను ఆశ్రయించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు బస్సు డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్‌లను ఉత్తర ఢిల్లీలోని తిమార్పూర్లోని బస్సు పార్కింగ్ ప్రాంతం నుంచి అరెస్ట్ చేశారు. బస్సును స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఘటనకు సంబంధించిన మార్గంలోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
స్లీపర్ బస్సులో బెర్త్‌లకు కర్టెన్లు ఉండటంతో లోపల జరుగుతున్న విషయం బయటివారికి కనిపించకుండా ఉండే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
