ఎలబోతారంలో వృద్ధురాలి మృతి మిస్టరీ వీడింది
తల్లి మృతిపై దర్యాప్తు చేపట్టిన సైదాపూర్ పోలీసులు.. ఇద్దరు కుమారులపై కేసు

సైదాపూర్, ఆగస్టు 24 (Zindagi9news): సైదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలబోతారం గ్రామంలో సుమారు 80 ఏళ్ల వయసున్న వెంకటమ్మ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ఆమె ఇద్దరు కుమారులపై హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్, ఎస్సై స్వాతి తెలిపారు.
సైదాపూర్ పోలీస్ స్టేషన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోలీసులు వివరాలు వెల్లడించారు. వెంకటమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, ఘటనకు ముందు సుమారు పది రోజులుగా పక్షవాతంతో మంచానికే పరిమితమైందని తెలిపారు. ఆమెకు నలుగురు కుమారులు వంతుల వారీగా భోజనం అందిస్తూ సంరక్షణ చూసుకునేవారని చెప్పారు.
అయితే వెంకటమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆమె తమలో ఎవరి ఇంట్లో మృతి చెందినా ఆ ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తుందనే మూఢనమ్మకంతో కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో పెద్ద కుమారుడు నూనె సమ్మయ్య, చిన్న కుమారుడు నూనె శ్రీనివాసు కలిసి వెంకటమ్మను హత్య చేయాలని పథకం వేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇతర కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో వృద్ధురాలిని ఇంటి నుంచి తీసుకెళ్లి సమీపంలోని వ్యవసాయ బావిలో పడవేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
వెంకటమ్మ కనిపించకుండా పోయిన తర్వాత నిందితులు ఆమె కోసం వెతుకుతున్నట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్తులను నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఎక్కడికో వెళ్లిపోయి ఉంటుందని పోలీసులకు సమాచారం ఇచ్చి అసలు విషయాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు.
అనుమానాస్పద మృతి నేపథ్యంలో సైదాపూర్ పోలీసులు గ్రామంలో పలుమార్లు విచారణ చేపట్టి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. వారి వాంగ్మూలాలు, సంఘటనకు సంబంధించిన పరిస్థితులు, నిందితుల ప్రవర్తనతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించగా హత్య కోణం వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.
ఈ ఘటనపై BNSS సెక్షన్ 194 ప్రకారం ఇన్క్వెస్ట్ నిర్వహించి దర్యాప్తు చేపట్టారు. అనంతరం హత్యకు సంబంధించిన ఆధారాలు లభించడంతో BNS సెక్షన్ 103(1), 238 r/w 3(5) కింద ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
