ఆదాయానికి మించి ఆస్తులు.. మైన్స్ అధికారి ఇంటిపై ఏసీబీ సోదాలు

హైదరాబాద్/వరంగల్, ఆగస్టు 27 (Zindagi9News):
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైన్స్ అండ్ జియాలజీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, ప్రస్తుతం వరంగల్ డిప్యూటీ డైరెక్టర్గా ఎఫ్ఏసీ బాధ్యతలు నిర్వహిస్తున్న బొజ్జ జయరాజుపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఏసీబీ వరంగల్ రేంజ్ అధికారులు గురువారం ఉదయం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అధికారి కార్యాలయం, బంధువులు, అనుచరులకు సంబంధించిన ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో పలు ఆస్తులు, ఆస్తుల పత్రాలను గుర్తించారు.
సోదాల్లో గుర్తించిన ఆస్తులు
- హైదరాబాద్ బోడుప్పల్లో సుమారు రూ.40 లక్షల విలువైన జీ+2 భవనం
- హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో సుమారు రూ.32.81 లక్షల విలువైన ఫ్లాట్
- కీసర, తుంగతుర్తి, తూప్రాన్, సూర్యాపేటలో ఐదు ప్లాట్లు – సుమారు రూ.15.77 లక్షలు
- 3.21 ఎకరాల వ్యవసాయ భూమి – సుమారు రూ.8 లక్షలు
- నగదు – రూ.10,03,640
- ఎల్ఐసీ, మ్యాక్స్ లైఫ్ పాలసీలు – సుమారు రూ.19.86 లక్షలు
- మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు – సుమారు రూ.40 లక్షలు
- పోస్టాఫీస్ పొదుపులు – సుమారు రూ.20.86 లక్షలు
- 629 గ్రాముల బంగారు ఆభరణాలు – సుమారు రూ.37.23 లక్షలు
- గృహోపకరణాలు – సుమారు రూ.10.67 లక్షలు
- మూడు బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలు – సుమారు రూ.71.27 లక్షలు
ఏసీబీ ప్రకారం ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల మొత్తం విలువ సుమారు రూ.3.06 కోట్లు. అయితే ఆస్తుల మార్కెట్ విలువ అధికారిక/డాక్యుమెంట్ విలువ కంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
డ్రైవర్ ఖాతా నుంచి రూ.24.80 లక్షల లావాదేవీలు
సోదాల సమయంలో లభించిన మొబైల్ ఫోన్, బ్యాంకు లావాదేవీలను పరిశీలించగా నిందితుడి డ్రైవర్ సత్తునూరి యాదయ్య బ్యాంకు ఖాతా నుంచి పలుమార్లు సుమారు రూ.24.80 లక్షలు అధికారి కుమార్తె బ్యాంకు ఖాతాకు బదిలీ అయినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. ఇసుక రవాణా, సంబంధిత కార్యకలాపాల్లో ఉన్న వ్యక్తుల నుంచి ఈ మొత్తాన్ని సేకరించి కుమార్తె ఖాతాకు బదిలీ చేసినట్లు డ్రైవర్ విచారణలో తెలిపినట్లు ఏసీబీ పేర్కొంది.
ఈ లావాదేవీల మూలం, స్వభావం, ఉద్దేశం, అక్రమ ముడుపులకు సంబంధించిన అంశాలపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. అదనపు ఆస్తులపై కూడా ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.
కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ వెల్లడించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
