భావి భారత పౌరులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే
గురువులను ఎడ్లబండిపై ఊరేగించి గురుభక్తిని చాటుకున్న పూర్వ విద్యార్థులు

నిజామాబాద్ రూరల్(సిరికొండ), అక్టోబర్ 16 (జిందగీ 9 న్యూస్): సిరికొండ మండలంలోని చీమన్పల్లి గ్రామంలో 1982 నుంచి 1985 వరకు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను ఆనాటి పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఎన్నో సంవత్సరాల తర్వాత తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను కలుసుకున్న పూర్వ విద్యార్థులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆత్మీయంగా గడిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఎడ్లబండిపై ఊరేగించి తమ గురుభక్తిని, గౌరవాన్ని చాటుకున్నారు.తమకు విద్యాబుద్ధులు నేర్పి, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి మార్గదర్శకులైన గురువులను పూర్వ విద్యార్థులు శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల రోజుల్లోని మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, ఆనాటి స్నేహాలను పంచుకుంటూ గురువుల ఆశీస్సులు అందుకున్నారు. ఉపాధ్యాయులను ఎడ్లబండిపై ఊరేగించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కళ్లెం నరసయ్య మాట్లాడుతూ, భావి భారత పౌరులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని అన్నారు. కనీస వసతులు కూడా లేని కాలంలో ఉపాధ్యాయులు గ్రామంలోనే ఉంటూ విద్యార్థులకు విద్యాబోధన చేసి, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థులకు విద్యతోపాటు నైతిక విలువలను అందించి, మంచి సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఏనుగు రాజేందర్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మారుపాక రజిత, వార్డు సభ్యులు గణేష్ మాలావత్, లావణ్య రాజు, చార్వాక ప్రసాద్, పూర్వ విద్యార్థి, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం. బాలయ్య, ట్రాన్స్కో ఉద్యోగి, భీమ్గల్ ప్రాంత ఎస్టీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం. పల్సిరాం, ఉపాధ్యాయులు ఎం. జవహర్ లాల్, ఉపసర్పంచ్ మూల లింగారెడ్డి, నాయకులు కె. జలంధర్, ఎం. నందిలాల్, గడ్డం రాజిరెడ్డి, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
