కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సహారా బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. బాలయ్య

నిజామాబాద్ రూరల్ (ధర్పల్లి), అక్టోబర్ 15 (జిందగీ 9 న్యూస్): సహారా ఇండియా సంస్థలో పొదుపు చేసుకున్న దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు బకాయిలను వెంటనే చెల్లించాలని సహారా బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. బాలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్మూర్లో నిర్వహించిన బ్రాంచ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల మంది ఖాతాదారులు తమ భవిష్యత్తు అవసరాల కోసం కష్టపడి సంపాదించిన డబ్బును సహారా సంస్థలో పొదుపు చేసుకున్నారని తెలిపారు. ఖాతాదారులకు డబ్బులు తిరిగి చెల్లిస్తామని గత మూడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారని, అయితే బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని విమర్శించారు. 2023 జూన్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే డబ్బులు చెల్లిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సుమారు కోటి 40 లక్షల మంది ఖాతాదారులు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో సుమారు 35 లక్షల మందికి మాత్రమే రూ.9,200 కోట్లు చెల్లించారని బాలయ్య పేర్కొన్నారు. ఇంకా రూ.2 లక్షల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని, గత ఏడాది నుంచి ఆన్లైన్ దరఖాస్తు విధానం సరిగా పనిచేయక ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పొదుపు చేసిన డబ్బులు తిరిగి వస్తే పిల్లల చదువులు, వివాహాలు, ఇళ్ల నిర్మాణం వంటి అవసరాలు తీర్చుకోవచ్చని ఆశించిన బాధితులకు నిరాశ ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు జి. నరేందర్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజల పొదుపు సొమ్మును చెల్లించడంలో జాప్యం చేయడం వల్ల బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఖాతాదారులకు న్యాయం చేయాలని కోరారు. సీఆర్సీఎస్ పోర్టల్ నిర్వహణ ఖర్చులు, అధికారుల వేతనాలపై కూడా ఆయన విమర్శలు చేశారు. జిల్లా నాయకుడు కమ్మరి నర్సయ్య మాట్లాడుతూ సహారా ఇండియా సంస్థకు చెందిన ఆస్తుల విలువ భారీగా ఉందని, వాటి ద్వారా ఖాతాదారులకు బకాయిలు చెల్లించే చర్యలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఆస్తుల నిర్వహణ, విక్రయాల విషయంలో జాప్యం జరిగితే బాధితులకు నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సాయికుమార్ మాట్లాడుతూ పేదల పొదుపు సొమ్మును తిరిగి చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. నేషనల్ బ్యాంకులు లేదా పోస్టాఫీసుల ద్వారా బాధితులకు డబ్బులు చెల్లించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రవి, శేఖర్, భూమేశ్వర్, సాయిలు, పురుషోత్తం, నారా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
