రూ.30 కోట్ల విలువైన పాకిస్థాన్ రాతి ఉప్పు అక్రమ రవాణా గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్

న్యూఢిల్లీ, అక్టోబర్ 14 (జిందగీ 9 న్యూస్): పాకిస్థాన్ నుంచి శ్రీలంక మీదుగా భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.30 కోట్ల విలువైన రాతి ఉప్పు (రాక్ సాల్ట్) దిగుమతుల వ్యవహారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు వెలుగులోకి తెచ్చారు. ‘ఆపరేషన్ డీప్ మానిఫెస్ట్’ పేరుతో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో 7,311 మెట్రిక్ టన్నుల పాకిస్థాన్ మూలానికి చెందిన రాతి ఉప్పును గుర్తించారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న నలుగురిని అరెస్టు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
భారత్‌కు పాకిస్థాన్ వస్తువుల దిగుమతిపై నిషేధం ఉండటంతో అక్రమ రవాణా ముఠా శ్రీలంకలోని కొలంబో పోర్టు ద్వారా సరుకును భారత్‌కు తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఉప్పు అసలు మూలాన్ని దాచేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కు చెందిన సంస్థల పేరుతో నకిలీ ఇన్వాయిస్లు, తప్పుడు మూల ధ్రువీకరణ పత్రాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. శ్రీలంక కస్టమ్స్ రికార్డులు, సరుకు రవాణా పత్రాలను పరిశీలించగా ఉప్పు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు, దాని తుది గమ్యస్థానం భారత్ అని గుర్తించారు.
గుజరాత్‌లోని ముంద్రా, కాండ్లా పోర్టుల ద్వారా తొమ్మిది మంది దిగుమతిదారులు 295 కంటైనర్లలో ఈ ఉప్పును భారత్‌కు తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 11 వరకు గాంధీధామ్, ఆదిపూర్, వెరావల్, పానిపట్, పుణె, పాటియాలా, ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కాండ్లా పోర్టులో రూ.24.41 లక్షల విలువైన 140 మెట్రిక్ టన్నుల రాతి ఉప్పుతో ఉన్న ఐదు కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు. దిగుమతిదారుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.20.96 లక్షల విక్రయాల సొమ్మును సైతం సీజ్ చేశారు.
ఈ కేసులో దిగుమతి సంస్థలకు చెందిన ఇద్దరు యజమానులు లేదా భాగస్వాములు, కస్టమ్స్ బ్రోకర్‌కు చెందిన జీ-కార్డు హోల్డర్, దుబాయ్‌కు చెందిన సరఫరా సంస్థ యజమాని సహా నలుగురిని కస్టమ్స్ చట్టం-1962 కింద అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. 2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం పాకిస్థాన్‌లో ఉత్పత్తి చేసిన లేదా అక్కడి నుంచి ఎగుమతి చేసిన వస్తువులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దిగుమతి చేసుకోవడం, రవాణా చేయడంపై నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘించి అక్రమంగా సరుకును దిగుమతి చేసిన వ్యవహారంపై DRI అధికారులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
