
హుజూరాబాద్, అక్టోబర్ 7(Zindagi9news): ఎలాంటి మున్సిపల్ అనుమతులు, నాలా (NALA) కన్వర్షన్ లేకుండా తన రిజిస్టర్డ్ స్థలాన్ని ఆక్రమించి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపడుతున్నారని ఆరోపిస్తూ హుజూరాబాద్‌కు చెందిన సబ్బని వరలక్ష్మి అధికారులకు ఫిర్యాదు చేశారు. నిర్మాణ పనులను వెంటనే నిలిపివేసి, అధికారికంగా సర్వే నిర్వహించి తనకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం హుజూరాబాద్ డివిజన్ ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీవోకు లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేశారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు ధర్మక్కపేట శివారులో సర్వే నంబర్ 1988 A/C/Aలో తనకు 242 చదరపు గజాల (2 గుంటలు) రిజిస్టర్డ్ స్థలం ఉందని తెలిపారు. అయితే తన స్థలానికి ఉత్తరం వైపున ఉన్న పోక స్వరూప, పోక సాయికిరణ్‌లు ఎలాంటి ప్రభుత్వ లేదా మున్సిపల్ అనుమతులు తీసుకోకుండా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా తమ స్థల హద్దులను దాటి సుమారు 12 అంగుళాల నుంచి ఒక అడుగు మేరకు చొచ్చుకువచ్చి పునాదులు తవ్వుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై ప్రశ్నించగా దౌర్జన్యంగా వ్యవహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వరలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమంగా కొనసాగుతున్న నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయడంతో పాటు అధికారిక సర్వేయర్‌తో స్థల సరిహద్దులను కొలిపించి తనకు న్యాయం చేయాలని ఆర్డీవోతో పాటు మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. కాగా, ఫిర్యాదుపై స్పందించిన అధికారులు విచారణ నిమిత్తం దరఖాస్తును మున్సిపల్ అధికారులకు బదిలీ చేసినట్లు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
