హనుమకొండ జిల్లాలో 55 అంగన్వాడీ టీచర్ పోస్టులు.. మండలాల వారీగా ఖాళీల జాబితా

హనుమకొండ, సెప్టెంబర్ 28: హనుమకొండ జిల్లాలోని మూడు ICDS ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 55 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ మేరకు జిల్లా సంక్షేమ అధికారి, మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22న నోటిఫికేషన్ జారీ చేశారు. దరఖాస్తులకు అక్టోబర్ 6, 2026 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది.
జిల్లాలోని భీమదేవరపల్లి ICDS ప్రాజెక్టులో 23, హనుమకొండ ICDS ప్రాజెక్టులో 19, పరకాల ICDS ప్రాజెక్టులో 13 పోస్టులు కలిపి మొత్తం 55 పోస్టులు ఉన్నాయి. కేంద్రాల వారీగా విడుదల చేసిన జాబితా ప్రకారం భీమదేవరపల్లి మండలంలో 13, కమలాపూర్‌లో 3, ఎల్కతుర్తిలో 4, హసన్‌పర్తిలో 3, హనుమకొండలో 6, ధర్మసాగర్లో 3, ఇనవోలులో 4, కాజీపేటలో 1, వేలేరులో 2, పరకాలలో 2, దామెరలో 7, శాయంపేటలో 1, ఆత్మకూర్‌లో 2, నడికూడలో 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 2026 జూలై 1 నాటికి వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. సంబంధిత అంగన్వాడీ కేంద్ర పరిధిలోని స్థానిక మహిళలు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

అభ్యర్థుల ఎంపికకు 100 మార్కుల విధానం అమలు చేయనున్నారు. ఇంటర్మీడియట్/12వ తరగతి మార్కులకు 70 మార్కులు కేటాయించగా, వికలాంగులు, అనాథలు, విధవలకు నిబంధనల ప్రకారం అదనపు మార్కులు కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు.
దరఖాస్తుతో పాటు SSC సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, విద్యార్హత ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం తదితర అవసరమైన పత్రాల స్కాన్ కాపీలను సమర్పించాలి. పోస్టుల వారీగా SC, OC, BC-A, BC-B, BC-C, BC-D, BC-E, ST, EWS, VH తదితర రిజర్వేషన్ వివరాలను కూడా అధికారులు విడుదల చేసిన ఖాళీల జాబితాలో పేర్కొన్నారు.
అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తుల చివరి గడువు అక్టోబర్ 6, 2026 సాయంత్రం 5 గంటలు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
