కరీంనగర్లో భారీ పెట్టుబడి మోసం.. లక్నోలో ముగ్గురు అరెస్ట్

కరీంనగర్ క్రైం, సెప్టెంబర్ 23: పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో డబ్బులు రెండింతలు, మూడింతలు చేస్తామని నమ్మించి ప్రజల నుంచి భారీగా నగదు వసూలు చేసిన కేసులో ముగ్గురు అంతరాష్ట్ర నిందితులను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో తలదాచుకున్న ప్రధాన నిందితుడు హేమంత్ కుమార్ రాయ్‌తో పాటు రాజేష్ కుమార్, బ్రిజేష్ కుమార్ మిశ్రాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు 2020లో లక్నో కేంద్రంగా ‘శ్రేయ ఇన్ఫ్రా అండ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థను ఏర్పాటు చేశారు. వివిధ పెట్టుబడి పథకాలను ప్రవేశపెట్టి అధిక లాభాలు వస్తాయని ప్రజలను నమ్మించారు. నెట్వర్క్ చైన్ విధానంలో కొత్తగా చేరిన పెట్టుబడిదారుల నుంచి సేకరించిన డబ్బుతో పాత పెట్టుబడిదారులకు చెల్లింపులు చేస్తూ మరింత మందిని పెట్టుబడులకు ఆకర్షించినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో పెట్టుబడులు సేకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కొంతకాలం పాటు చెల్లింపులు చేసిన అనంతరం 2024 మే నుంచి చెల్లింపులు నిలిపివేసినట్లు తెలిపారు. కరీంనగర్‌కు చెందిన గుగులోత్ శివరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, అనంతరం కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఆర్. ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లింది. సెప్టెంబర్ 18న రాత్రి లక్నోలోని నిందితుల నివాసాల్లో తనిఖీలు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం లక్నోలోని చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలించారు.
ఈ కేసును ఛేదించడంలో కీలకంగా పనిచేసిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఆర్. ప్రకాశ్ గౌడ్, ఎస్సై డి. మహిపాల్ రెడ్డి, పోలీసు సిబ్బందిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అభినందించారు. శ్రేయ ఇన్ఫ్రా సంస్థ ద్వారా మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే సమీప పోలీస్ స్టేషన్ లేదా కరీంనగర్ సీసీఎస్ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
