ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. రూ.9 కోట్ల విలువైన 6.5 కిలోలు సీజ్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ బంగారం అక్రమ రవాణా వ్యవహారాన్ని ఛేదించారు. దుబాయ్ నుంచి ఢిల్లీ వచ్చిన విమానంలో సుమారు 6.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.9 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ కేసులో ఒక మహిళ సహా మొత్తం 8 మంది ప్రయాణికులను అరెస్ట్ చేశారు.
కస్టమ్స్ అధికారులకు అందిన పక్కా సమాచారంతో సెప్టెంబర్ 21న దుబాయ్ నుంచి ఢిల్లీ వచ్చిన Emirates Flight EK-514లో తనిఖీలు నిర్వహించారు. విమానంలో రెండు సీట్ల కింద మూడు చిన్న బ్యాగులు కనిపించడంతో వాటిని తనిఖీ చేయగా బంగారం బయటపడింది.
వెండి, నలుపు రంగులతో బంగారానికి కొత్త రూపం
అధికారులు తెలిపిన ప్రకారం .. స్మగ్లర్లు బంగారాన్ని చైన్ల రూపంలో తయారు చేసి, వాటిపై వెండి, నలుపు రంగులను స్ప్రే చేశారు. సాధారణ ఆభరణాల మాదిరిగా కనిపించేలా చేసి కస్టమ్స్ అధికారుల దృష్టికి రాకుండా చేయడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
విచారణలో నిందితులు ఎగ్జిబిషన్లకు హాజరవుతున్నామనే పేరుతో తరచూ దుబాయ్‌కు వెళ్లి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో బంగారాన్ని చైన్లు, ఆభరణాల రూపంలో ఒంటిపై ధరించి తీసుకువచ్చే పద్ధతిని అనుసరించినట్లు కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.
8 మంది అరెస్ట్.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
బంగారం స్వాధీనం అనంతరం అదే విమానంలో ప్రయాణించిన ఎనిమిది మందిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న నెట్వర్క్, దుబాయ్‌లోని సంబంధాలు, బంగారం ఎవరికి చేరాల్సి ఉంది, గతంలో ఇలాంటి రవాణా ఎన్ని సార్లు జరిగిందనే అంశాలపై కస్టమ్స్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
