యూపీలో అమానుషం.. మూడు నెలల పసికందుపై అఘాయిత్యం

మెయిన్‌పురి, సెప్టెంబర్ 4: ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బెవార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కేవలం మూడు నెలల వయసున్న పసికందుపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు కన్హయ్య సక్సేనా మంగళవారం సాయంత్రం బాధిత కుటుంబం ఇంటికి వచ్చాడు. చిన్నారికి అన్నం తినిపిస్తానని చెప్పి ఆమెను ఎత్తుకుని బయటకు తీసుకెళ్లినట్లు సమాచారం. కొద్దిసేపటి తర్వాత చిన్నారిని తిరిగి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
చిన్నారి తీవ్రంగా ఏడుస్తుండటంతో కుటుంబ సభ్యులు గమనించగా, ఆమెకు తీవ్ర రక్తస్రావం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే స్థానిక వైద్యుడి వద్దకు, అనంతరం బెవార్ ఆరోగ్య కేంద్రం, మహిళా జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం సైఫాయ్ మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బెవార్ పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని ప్రత్యేక బృందాలతో గాలించి అదుపులోకి తీసుకున్న పోలీసులు, అనంతరం జైలుకు తరలించినట్లు వెల్లడించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
