రూ.6.87 కోట్ల అక్రమాస్తులు.. తహసీల్దార్‌పై ACB కేసు

రంగారెడ్డి, ఆగస్టు 20 (జిందగీ9న్యూస్): ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం RDO కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న తహసీల్దార్ దేశాని శ్రీనివాస్ రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ACB) కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(b) r/w 13(2) కింద కేసు నమోదు చేసినట్లు ACB వెల్లడించింది.
గురువారం ఆయన ఇల్లు, కార్యాలయంతో పాటు బంధువులు, అనుచరులకు సంబంధించిన మరో ఐదు ప్రాంతాల్లో ACB అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో కర్మన్‌ఘాట్‌లో రెండు నివాస ఫ్లాట్లు, ఒక G+3 పెంట్‌హౌస్, యాచారం మండలంలోని 10 ఎకరాల వ్యవసాయ భూమి, నగర పరిధి, శివారు ప్రాంతాల్లో 8 ఓపెన్ ప్లాట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నరేంద్ర బార్ అండ్ రెస్టారెంట్ భాగస్వామ్య పెట్టుబడిలో రూ.86 లక్షలు ఉన్నట్లు వెల్లడించారు.
అదనంగా రూ.4 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.8.60 లక్షలు, 680 గ్రాముల బంగారు ఆభరణాలు, నాలుగు చక్రాల వాహనాలు 3, ద్విచక్ర వాహనాలు 2, రూ.11 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు గుర్తించినట్లు ACB తెలిపింది. 46 తులాల బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం పొందినట్లు కూడా వెల్లడించింది.
ACB అంచనా ప్రకారం నిందితుడి మొత్తం ఆస్తుల విలువ రూ.6,87,36,792గా ఉంది. గతంలో 2009లో మహేశ్వరం మండలంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసిన సమయంలో కూడా ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైనట్లు ACB పేర్కొంది. కేసు దర్యాప్తులో ఉంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
