‘నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపుతావా?’.. ప్రియుడితో కలిసి హత్య కుట్ర ఆరోపణ
భార్య, ఆమె ప్రియుడిపై డోర్నకల్ పోలీసులకు భర్త ఫిర్యాదు.. సెల్‌ఫోన్ సందేశాలు, ఆధారాలు సమర్పించినట్లు వెల్లడి

మహబూబాబాద్, ఆగస్టు 7 (జిందగి9న్యూస్): మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో భార్య, ఆమె ప్రియుడిపై భర్త హత్య కుట్ర ఆరోపణలు చేయడం కలకలం రేపింది. చిలుకోడు గ్రామానికి చెందిన గాదె రాజేశ్వరరావు తన భార్య భవానీ, ఆమె ప్రియుడు సైదులు కలిసి తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని డోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రాజేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. 2016లో సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రాఘవపురం గ్రామానికి చెందిన భవానీతో తన వివాహం జరిగిందని, వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారని తెలిపారు. తాను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్న సమయంలో గత కొంతకాలంగా భార్య ప్రవర్తనలో మార్పులు గమనించినట్లు పేర్కొన్నారు.
ఖమ్మంలో కొరియర్ బాయ్‌గా పనిచేసే సైదులతో తన భార్యకు పరిచయం ఏర్పడి, అది ప్రేమ వ్యవహారంగా మారిందని ఆరోపించారు. తాను ఇంట్లో లేని సమయంలో సైదులు ఇంటికి వచ్చి వెళ్లేవాడని, తమ మధ్య తాను అడ్డుగా ఉన్నానని భావించి తనను తొలగించేందుకు కుట్ర పన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కుట్రకు సంబంధించిన సెల్‌ఫోన్ సందేశాలు, ఇతర ఆధారాలను పోలీసులకు అందజేసినట్లు రాజేశ్వరరావు తెలిపారు. తనకు, తన ఇద్దరు కుమార్తెలకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.
ఫిర్యాదు స్వీకరించిన డోర్నకల్ పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలిస్తూ, కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
