
పెట్రోల్ పోసి వ్యక్తిని సజీవ దహనం చేసిన కేసు ఛేదించిన వరంగల్ పోలీసులు.. ఏడుగురు అరెస్ట్
పాత కక్షతో హత్యకు కుట్ర.. ప్రధాన నిందితుడు గతంలో హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవించిన వ్యక్తేనని వెల్లడి
వరంగల్, జూలై 26 (జిందగి9న్యూస్): వరంగల్ జిల్లాలో పెట్రోల్ పోసి వ్యక్తిని సజీవ దహనం చేసిన సంచలన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత వెల్లడించారు.మృతుడు అడుపు మహేష్‌పై ప్రధాన నిందితుడు పత్తి కుమారస్వామి అలియాస్ కుమార్ పాత కక్ష పెంచుకున్నాడని, తన రాజకీయ ప్రాధాన్యతను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే అనుమానంతో హత్యకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
ఈ నెల 18వ తేదీ రాత్రి పరిమళ కాలనీ రోడ్డు నంబర్–2 వద్ద మృతుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించగా, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ జూలై 19న మహేష్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు మరో ఆరుగురు కలిసి హత్యకు పాల్పడినట్లు గుర్తించి వారిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మరో నిందితుడు సురేష్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
ప్రత్యేక పోలీసు బృందాల సహాయంతో నిందితులను వేగంగా గుర్తించి అరెస్టు చేసినట్లు కమిషనర్ తెలిపారు. కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేసి, నిందితులకు న్యాయస్థానం ద్వారా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన మామునూరు ఏసీపీ వెంకట్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, దర్యాప్తు అధికారి విశ్వేశ్వర్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు బాబులాల్, సుబ్బారెడ్డి, దేవేందర్, శ్రీధర్‌తో పాటు గీసుగొండ పోలీస్ స్టేషన్, టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అభినందించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
