ఇందిరమ్మ టవర్స్ పేరుతో సైబర్ మోసాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సజ్జనార్
దళారులను నమ్మొద్దు.. రూ.10 వేల ఈఎండీ చెల్లింపులు అధికారిక మార్గంలోనే చేయాలి.. మోసపోతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి

హైదరాబాద్, జూలై 26 (జిందగి9న్యూస్): హైదరాబాద్‌లో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ ఇళ్ల కేటాయింపు పేరిట సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. లబ్ధిదారుల నుంచి రూ.10 వేల ఈఎండీ చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, అపరిచిత లింకుల ద్వారా మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు.
ఈ పథకంలో ఎలాంటి దళారులు లేదా మధ్యవర్తులకు అవకాశం లేదని, ఇళ్ల కేటాయింపు పూర్తిగా పారదర్శక విధానంలో జరుగుతుందని తెలిపారు. నిబంధనల ప్రకారం చెల్లించిన ఈఎండీ సొమ్ము పూర్తిగా భద్రంగా ఉంటుందని, ఒకవేళ ఇల్లు కేటాయించకపోతే అదే బ్యాంకు ఖాతాకు ప్రభుత్వం నేరుగా తిరిగి జమ చేస్తుందని స్పష్టం చేశారు. “డబ్బులు చెల్లిస్తే కచ్చితంగా ఇల్లు ఇప్పిస్తాం” లేదా “ఈ రోజే చివరి తేదీ.. వెంటనే డబ్బులు కట్టకపోతే దరఖాస్తు రద్దవుతుంది” వంటి మాటలను నమ్మవద్దని సూచించారు.
వాట్సాప్ లేదా ఇతర సందేశాల ద్వారా వచ్చే అపరిచిత లింకులను క్లిక్ చేయడం, ఏపీకే (APK) ఫైళ్లను ఇన్స్టాల్ చేయడం వల్ల మొబైల్ ఫోన్ హ్యాక్ అయ్యి బ్యాంకు ఖాతాల్లోని నగదు దోచుకునే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ పోర్టళ్లను పోలిన నకిలీ వెబ్సైట్లు, అలాగే AnyDesk, TeamViewer వంటి స్క్రీన్ షేరింగ్ యాప్‌ల ద్వారా కూడా మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. యూపీఐ పిన్ డబ్బులు పంపడానికి మాత్రమే ఉపయోగపడుతుందని, రీఫండ్ స్వీకరించడానికి యూపీఐ పిన్ నమోదు చేయాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు. అపరిచిత వ్యక్తులతో ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీలు పంచుకోవద్దని సూచించారు.
ఇందిరమ్మ టవర్స్ పథకానికి సంబంధించిన సందేహాల నివృత్తి కోసం ప్రభుత్వం 040-24603572 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 జాతీయ సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలని సీపీ సజ్జనార్ సూచించారు.
