ఆర్టీసీ కుటుంబానికి అండగా ఉద్యోగులు.. దివంగత డ్రైవర్ కుటుంబానికి రూ.90.85 లక్షల సాయం
దివంగత డ్రైవర్ కోలా శంకర్ కుటుంబానికి చెక్కు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
కుమారుడికి ఆర్టీసీలో ఉద్యోగం, ఇల్లు మంజూరు చేసిన ప్రభుత్వం
ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి

హైదరాబాద్, జూలై 20 (Zindagi9News): టీజీఎస్ ఆర్టీసీ కేవలం రవాణా సంస్థ మాత్రమే కాదని, వేలాది మంది ఉద్యోగులతో కూడిన ఒక పెద్ద కుటుంబమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నర్సంపేట డిపోకు చెందిన దివంగత డ్రైవర్ కోలా శంకర్ కుటుంబానికి ఆర్టీసీ ఉద్యోగులు ‘చేయూత’ కార్యక్రమం ద్వారా స్వచ్ఛందంగా సేకరించిన రూ.90.85 లక్షల ఆర్థిక సాయాన్ని సోమవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్మికుల కోసం ప్రాణత్యాగం చేసిన కోలా శంకర్ కుటుంబానికి ఆర్టీసీ ఉద్యోగులు అండగా నిలవడం వారి మానవత్వానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్ని విధాలా సహకరిస్తుందని, శంకర్ కుమారుడు హేమంత్‌కు ఆర్టీసీలో ఉద్యోగం కల్పించడంతో పాటు ఇల్లు కూడా మంజూరు చేసినట్లు ప్రకటించారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీలోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని మంత్రి తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుతో ప్రభుత్వం ప్రతి నెలా రూ.300 కోట్లు ఆర్టీసీకి విడుదల చేస్తోందని చెప్పారు. కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, రూ.6 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా ఇందిరమ్మ ఇళ్లకు అర్హులని స్పష్టం చేశారు.
ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ తోటి ఉద్యోగి కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు సిబ్బంది ఏకతాటిపైకి వచ్చి రూ.90.85 లక్షల సాయం అందించడం సంస్థలోని ఐక్యతకు నిదర్శనమన్నారు. ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల భద్రతకు యాజమాన్యం ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు, యూనియన్ నాయకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
