కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాలాభిషేకాలు, జలాభిషేకాలకు నో.. టీపీసీసీ కీలక ఆదేశాలు
జేసీబీలు, బుల్డోజర్లతో భారీ హారాలు వేయడానికీ నిషేధం.. ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు

హైదరాబాద్, జూలై 16 (Zindagi9News): కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ పాలాభిషేకాలు (పాలాభిషేకం), జలాభిషేకాలు (జలాభిషేకం) నిర్వహించరాదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు టి. కుమార్ రావు గురువారం పార్టీ నేతలకు సర్క్యులర్ విడుదల చేశారు.
ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్క్యులర్లో పేర్కొన్నారు. ఆహార పదార్థాలను వృథా చేయడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, విలువలకు విరుద్ధమని, పోషకాహార లోపంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో అలాంటి కార్యక్రమాల కంటే ఆహార పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
అలాగే రాష్ట్రంలో సీనియర్ నాయకుల పర్యటనల సందర్భంగా జేసీబీలు, బుల్డోజర్లు తదితర భారీ యంత్రాలతో అతిపెద్ద హారాలు వేయడం కూడా పూర్తిగా నిషేధిస్తున్నట్లు టీపీసీసీ తెలిపింది. ఇకపై అలాంటి చర్యలకు పాల్పడితే సంబంధిత నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ సర్క్యులర్ ప్రతులను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ అనుబంధ విభాగాలు, డీసీసీ అధ్యక్షులకు పంపినట్లు వెల్లడించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
