రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్.. ఇంట్లో రూ.32.31 లక్షల నగదు స్వాధీనం

పెద్దపల్లి, జూలై 14 (జిందగి9న్యూస్): పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కల్లెపల్లి సతీష్ కుమార్‌ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మంగళవారం లంచం స్వీకరిస్తుండగా పట్టుకున్నారు. కాంట్రాక్టర్ చేపట్టిన తెనుగువాడ హిందూ శ్మశానవాటిక అభివృద్ధి, కునారం రోడ్డులో శ్మశానవాటిక అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.1,22,28,748 విలువైన తుది బిల్లును ప్రాసెస్ చేసి ఆమోదానికి పంపేందుకు రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా కరీంనగర్ ఏసీబీ యూనిట్ అధికారులు ఆయన నివాసంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
లంచంగా తీసుకున్న రూ.2 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడి నివాసంలో నిర్వహించిన సోదాల్లో లెక్కల్లో చూపని రూ.32,31,900 నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమ ప్రయోజనం పొందినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో ఆయనను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
నిందితుడిని కరీంనగర్‌లోని SPE & ACB ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు ఏసీబీ తెలిపింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారు వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.
