పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మృతి.. ఒకరి పరిస్థితి విషమం

నల్గొండ, జూలై 5(Zindagi9news): నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలను సేకరించారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టి త్వరితగతిన నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, వాహనాల మధ్య సురక్షిత దూరం పాటించకపోవడం వల్లే ఎక్కువ శాతం ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
