- విద్యుత్ ఉద్యోగులకు డీఏ పెంపు
- 1.621 శాతం పెంపుతో 70,804 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లాభం
- 2035 నాటికి విద్యుత్ డిమాండ్ రెట్టింపు.. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు భట్టి విక్రమార్క ఆదేశం

హైదరాబాద్, జూన్ 17(Zindagi9news): రాష్ట్ర విద్యుత్ రంగ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు 1.621 శాతం డీఏ పెంపునకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆమోదం తెలిపారు. విద్యుత్ సౌధలో జెన్కో ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఇంధన శాఖ సమీక్ష సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా డీఏ పెంపు ప్రతిపాదనకు పచ్చజెండా ఊపడంతో విద్యుత్ ఉద్యోగుల డీఏ 17.651 శాతం నుంచి 19.272 శాతానికి చేరింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై నెలకు సుమారు రూ.9.35 కోట్ల అదనపు భారం పడనుండగా, విద్యుత్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న 70,804 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.
సమీక్ష సందర్భంగా భట్టి విక్రమార్క రాబోయే వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడితే వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు క్షేత్రస్థాయిలో అమలు చేయాలని స్పష్టం చేశారు.
ఈ వేసవిలో రికార్డు స్థాయిలో 18,548 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదైనప్పటికీ, ఎక్కడా అంతరాయం లేకుండా నిరంతరాయ సరఫరా అందించిన అధికారులు, సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి అభినందించారు. అలాగే మార్చి 13, 2026న 341 మిలియన్ యూనిట్ల అత్యధిక విద్యుత్ వినియోగం నమోదైనా సమర్థవంతంగా సరఫరా కొనసాగించడంపై హర్షం వ్యక్తం చేశారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే పదేళ్లకు దీర్ఘకాలిక విద్యుత్ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 2035-36 నాటికి గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 34,137 మెగావాట్లకు చేరుకునే అవకాశముందని, వార్షిక విద్యుత్ అవసరాలు 1,52,626 మిలియన్ యూనిట్లకు పెరుగుతాయని పేర్కొన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్కో సీఎండీ హరీష్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
