ఈ నెలాఖరులో సీఎం చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం
మున్సిపల్, శాతవాహన విశ్వవిద్యాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
జిల్లా అభివృద్ధికి పరిపాలనా కేంద్ర బిందువుగా నూతన కలెక్టరేట్: మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, జూన్ 11(Zindagi9news): కరీంనగర్ జిల్లా ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నూతన కలెక్టరేట్ భవనాన్ని ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శాతవాహన విశ్వవిద్యాలయంలో చేపట్టిన అభివృద్ధి పనులను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
గురువారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి నూతన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన మంత్రి, భవనంలోని వివిధ విభాగాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నూతన కలెక్టరేట్ జిల్లా అభివృద్ధికి పరిపాలనా కేంద్ర బిందువుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
గతంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన కలెక్టరేట్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రత్యేక చొరవతో వేగవంతం చేసి పూర్తిచేయించారని తెలిపారు. అన్ని ఆధునిక సౌకర్యాలు, సాంకేతిక వసతులు, ప్రజలకు అనుకూలమైన సేవా వ్యవస్థతో కలెక్టరేట్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నట్లు వెల్లడించారు.
కలెక్టరేట్ ప్రారంభం అనంతరం పలు ప్రభుత్వ కార్యాలయాలను ఒకే ప్రాంగణంలోకి తీసుకువచ్చి ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించేలా చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. సుడా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో గ్రీనరీ, ల్యాండ్‌స్కేపింగ్ అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన ప్రభుత్వ కార్యాలయ సముదాయంగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ నిలుస్తుందని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి చెప్పారు. రాజకీయాలకు అతీతంగా కరీంనగర్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
పరిశ్రమలు, పర్యాటకం, విద్య, వైద్య రంగాల్లో జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో లా కాలేజీ, ఫార్మసీ కాలేజీ ఏర్పాటు ద్వారా ఉన్నత విద్యా అవకాశాలు విస్తరించాయని పేర్కొన్నారు.
ఆరోగ్య రంగంలో కరీంనగర్‌ను హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, మెడికల్ కాలేజీని టీచింగ్ హాస్పిటల్‌గా అప్‌గ్రేడ్ చేసినట్లు వెల్లడించారు. నూతన కలెక్టరేట్ ప్రాంగణంలోని హెలిప్యాడ్‌ను కూడా త్వరలో వినియోగంలోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు.
మానేరు రివర్‌ఫ్రంట్ రెండో దశ పనులను వేగవంతం చేస్తున్నామని, డంప్‌యార్డు తరలింపునకు కేంద్ర ప్రభుత్వ సహకారం కోరినట్లు చెప్పారు. జిల్లాలో చేపడుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతోనే కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
