
భూమి కౌలు గొడవలో తండ్రిని హతమార్చిన కుమారుడు
ఇల్లందకుంట, మే 15 (Zindagi9News): భూమి కౌలు వివాదం ఓ కుటుంబంలో విషాదానికి దారితీసింది. వ్యవసాయ భూమి కౌలు విషయంలో జరిగిన గొడవలో ఓ కుమారుడు తన తండ్రిని రోకలిబండతో కొట్టి హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని చిన్నకొమటిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన చిట్ల శ్రీధర్ (38), అతని అన్న చిట్ల శ్రీనివాస్ మధ్య వ్యవసాయ భూమి కౌలు విషయంలో శుక్రవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన శ్రీనివాస్, శ్రీధర్‌పై రోకలిబండతో దాడి చేయడానికి ప్రయత్నించగా, శ్రీధర్ తప్పించుకున్నాడు.
ఈ సమయంలో అక్కడే ఉన్న వారి తండ్రి చిట్ల సంపత్ (60) జోక్యం చేసుకుని, ఇద్దరు కుమారుల మధ్య గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. పెద్ద కుమారుడు శ్రీనివాస్‌ను ఎందుకు గొడవ పడుతున్నావని ప్రశ్నించగా, అతడు తీవ్ర ఆగ్రహంతో తండ్రిపై దాడికి పాల్పడ్డాడు. చేతిలో ఉన్న రోకలిబండతో సంపత్ తలపై బలంగా కొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయారు.
గాయపడిన సంపత్‌ను వెంటనే కుటుంబ సభ్యులు జమ్మికుంటలోని ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హన్మకొండకు తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఇల్లందకుంట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు శ్రీనివాస్‌పై హత్య కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
