- డీలిమిటేషన్, మహిళా బిల్లులను అడ్డుకున్నది విపక్షాలేనని ఆరోపణ
- జమిలి ఎన్నికల భయంతోనే రేవంత్ వ్యాఖ్యలంటూ విమర్శ
- మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్, డీఎంకే వైఖరిపై మండిపాటు
- దక్షిణాదికి న్యాయం చేస్తామన్న కేంద్రానికి విపక్షాల అడ్డంకులంటూ వ్యాఖ్యలు

కరీంనగర్, ఏప్రిల్ 21(zindagi9news):ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్థానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులపై విపక్షాలు అడ్డంకులు సృష్టించాయని ఆరోపించారు.
కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్, దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని చెప్పడం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని విమర్శించారు. జమిలి ఎన్నికలు వస్తే తెలంగాణలో బీజేపీ గెలుస్తుందనే భయంతోనే రేవంత్ రెడ్డి ఈ అంశాలను లేవనెత్తుతున్నారని అన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, టీఎంసీ వంటి పార్టీలు అడ్డుకున్నాయని ఆయన ఆరోపించారు. ఈ పార్టీల దృష్టిలో మహిళలంటే కొద్దిమంది కుటుంబ సభ్యులేనని, సాధారణ మహిళలు రాజకీయాల్లోకి వస్తే కుటుంబ రాజకీయాల పునాదులు కదిలిపోతాయనే భయంతోనే బిల్లును అడ్డుకుంటున్నారని విమర్శించారు.
డీలిమిటేషన్ అంశంపై మాట్లాడుతూ, దేశ జనాభా పెరిగిన నేపథ్యంలో పార్లమెంట్ సీట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచేలా కేంద్రం ఆలోచిస్తున్నప్పటికీ, విపక్షాలు అడ్డుకుంటున్నాయని పేర్కొన్నారు.
పార్లమెంట్లో చర్చకు సమయం ఇస్తే డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టి దక్షిణాదికి న్యాయం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినప్పటికీ, విపక్షాలు సహకరించలేదని బండి సంజయ్ ఆరోపించారు.
అదేవిధంగా, బీఆర్ఎస్తో బీజేపీకి పొత్తు ఉందన్న ఆరోపణలను ఖండిస్తూ, గతంలో కాంగ్రెస్ే బీఆర్ఎస్తో కలిసి పనిచేసిందని పేర్కొన్నారు.
